దిల్ హూ హూ కరే…




వణుకుతూ ప్రవహించే గొంతు నీది; జ్వరపడిన పిల్లాడిలాగా
దుప్పట్లో మునగదీసుకునే కలత నది.

కడుపుతో వున్న వొక మబ్బు తునకని నేల మీదికి దింపి,
చిట్లిపోతున్న దాని నరం మీద కమానుతో

తటిల్లున మెరిసే మెరుపు నువ్వు; దిగులు పడిన గోదారయి,
మౌనంలోకి ముడుచుకుపోయే ఆమెలాగా.

చిదిమిపోతూ నీటి బుగ్గ గొంతులో చివరి సారి
తడబడిన జీవన జ్వర వాంఛ నీ పదాల రాపిడిలో.

2
వొక మేఘ ఘర్జననీ
ఇంకో గుండె పగులునీ కలిపి పాడిన లోపలి పెను వాన

కురుస్తూ వుంది రాత్రి వెలుగుని తోడు పెట్టుకొని
పగలు చీకటిని కడుపులో దాచుకొని,

బండ రాళ్ళ నగరం వొంటి మీద.

3
రాయడానికేమీ లేదు,గుండె కూని రాగం ఆగేంత వరకూ.
భయమో ఏమో తెలియని రైలు దూసుకుపోతున్నట్టే, సొరంగంలోంచి.

4
ప్రాణం వుగ్గబట్టుకున్నానా, వొళ్ళు పిడికిలిలో దాచుకున్నానా,
పాట ఆపకు, నా చీకటి పరుగు ఆగేంత దాకా, నా జహాపనా!
Category: 15 comments

నాలుగు మాటలు ఇంకో సారి...

(చిత్రం: మహిమాన్విత)

వొకే వొక్క బుడగలో బుడుంగుమని మునగా లేం, తేలా లేం
అయితే కానివ్వు
బుడగలో పుట్టుకా
బుడగలో చావూ
అన్నీటినీ లోపలికి లాక్కు వెళ్ళే అక్షయ సముద్రం అదే!

వొక్కో సారి ఆశ్చర్యమూ లేదు విడ్డూరమూ కాదు
మాయా కాదు మంత్రమూ కాదు.
అంతా సచ్ ముచ్ సచ్...

2

ఇవాళ వొక బుడగలోంచి కళ్ళు తెరిచి చూశాను
చిన్న చిన్న నదులు చిట్టి కప్పల్లా ఎగిరెగిరి పడ్తున్నాయి.

ఇవాళ కళ్ళలోంచి వొక నీటి దీపం వెలిగించి చూశాను
కొన్ని వందల చీకటి గోళాలు గోలీ కాయల్లా దొర్లి పోతున్నాయి

ఏమీ తేడా కానలేను, మిత్రుడా!
నువ్వు ముడుచుకుపో నీ నీడలోనే!

3

గది దాటి వచ్చి చూస్తే ఆ నాలుగు దారులూ
నాలుగు ఖండాలుగా ఎటో ఎగిరిపోయాయి

గోడ పగలగొట్టి నడిచోస్తే ఆ పది మందీ
పాతిక దారుల్లో తప్పిపోయారు

ఏమీ కారణం చెప్పలేను, మిత్రుడా!
గదికీ లోకానికీ కటీఫ్!

4

ఎన్ని సార్లు గీసినా ఏకాంత చిత్రం
నువ్వు
గీసి చెరిపెయ్యలేని పసితనపు బొమ్మే నయం!

బొమ్మ ఇప్పటికీ దృశ్యమే.

పసితనమే అదృశ్యమయ్యింది.
Category: 2 comments

'చదువు అంటే ఇంజనీరింగ్ మాత్రమే కాదు'




(ఇది హైదరబాద్ నించి యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ లొ చదువుకోవడానికి వచ్చిన ఒక అండర్ గ్రాడుయేట్ విద్యార్థి...నా తెలుగు క్లాస్ కోసం అసైన్మెంటులొ భాగంగా అమ్మానాన్నలకి రాసిన ఒక ఉత్తరం...ఈ విద్యార్థి నేను చెప్పే "దక్షిణాసియా సాహిత్యం-సినిమా" "భారతీయ సాహిత్యం-ఆధునికత" కోర్సులలో కూడా వున్నాడు.ఇందులొ ఆలోచించాల్సిన విషయాలు వున్నాయని నాకు అనిపించింది...చదివి చూడండి)

"నేను చూసిన అన్ని కాలెజీల కన్నా, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ బాగుంతుంది. ఇక్కడ చేరడం, ఇక్కడ తెలుగు కోర్సులు, భారతీయ సాహిత్యం, సినిమా కోర్సులు కూడా వుండడం నిజంగా నా అద్రుష్టం...మీకు ఉత్తరం రాయటానికి ఒక బలమయిన కారణం వుంది. మీకు చెప్పినట్టు నేను ఇక్కడ ఇంజనీరింగ్ చదవడం లేదు. ఫిల్మ్ స్టడీస్ చేస్తున్నాను. నాకు కళలంటే ప్రాణం. ఇంజనీర్ అయితే, జీవితాన్ని తిరగేసి చూస్తే బాధ తప్ప ఏమీ మిగలదు అనుకుంటున్నా. అందుకే నా మేజర్లు మార్చాను. నేను మంచి సాహిత్యం చదువుతున్నాను. మంచి సినిమాలు ఎలా తీయాలో, వాటికి స్క్రిప్టు ఎలా రాయాలో నేర్చుకుంటున్నాను...నన్ను మీరు అర్థం చేసుకుంటారని నా ఆశ. కాని, ఏ రంగంలో వున్నా నేను మీకు మంచి పేరు తెచ్చి పెట్టగలనన్న నమ్మకం నాకు వుంది. ఆ నమ్మకం నాకు ఇక్కడి అధ్యాపకులు ఇస్తున్నారు...ఇక్కడి నా తోటి విద్యార్థులు ఇస్తున్నారు...చదువు అంటే ఇంజనీరింగ్ మాత్రమే కాదు అని గట్టిగా నమ్ముతున్నా..."
Category: 8 comments
Web Statistics